Mohammed Shami: ఐపీఎల్లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ కొత్త అవతారం
- క్రిక్‌బజ్ ఎక్స్పర్ట్ ప్యానెల్లో షమీకి చోటు
- మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లతో కలిసి చర్చల్లో పాల్గొననున్న టీమిండియా పేసర్
- ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్, షాన్ పోలాక్, హర్ష భోగ్లే
- చీలమండ గాయానికి సర్జరీ తర్వాత కోలుకుంటున్న మహ్మద్ షమీ
- ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరం.. గుజరాత్‌కు దెబ్బ
రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతున్న ఐపీఎల్-2024లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ ఐపీఎల్ 17వ సీజన్లో క్రిక్‌బజ్ నిర్వహించే చర్చల్లో అతడు విశ్లేషకుడిగా కనిపించనున్నాడు. ఈ మేరకు తాజాగా క్రిక్‌బజ్ ఎక్స్పర్ట్ ప్యానెల్లో షమీ చోటు దక్కించుకున్నాడు. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లతో కలిసి షమీ చర్చల్లో పాల్గొంటాడు. ఇక ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్, రోహాన్ గవాస్కర్, మనోజ్ తీవారి, షాన్ పోలాక్, హర్ష భోగ్లే తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. మహ్మద్ షమీ గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. చీలమండ గాయంతో బాధపడిన అతడు ఇటీవలే లండన్‌లో సర్జరీ చేయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం షమీ కోలుకుంటున్నాడు. దాంతో ఐపీఎల్ 17వ సీజన్‌కు అతడు దూరమయ్యాడు. కాగా, షమీ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ మొత్తానికి షమీ దూరం కావడం జీటీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక అతడు పూర్తిగా కోలుకుని మైదానంలో తిరిగి అడుగు పెట్టేది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లోనే అని ఇటీవలే బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించిన విషయం తెలిసిందే.