Kavitha ED Custody: ఈడీ కస్టడీలో కవిత ఉపవాసం.. గీతా పారాయణం
- ఉదయం, మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన అధికారులు
- పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్న ఎమ్మెల్సీ
- మరోసారి చెల్లిని కలిసి మాట్లాడిన కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. వారం రోజుల కస్టడీలో భాగంగా కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారణ సమయం పూర్తయిన తర్వాత కవిత ఎలా గడుపుతున్నారు.. ఏం చేస్తున్నారనే వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. బ్రేక్ సమయంలో, ఉదయం సాయంకాలం వేళల్లో కవిత పుస్తక పఠనం చేస్తున్నారని తెలిసింది. బుధవారం ఏకాదశి కావడంతో ఉపవాసం చేశారట. ఆమె కోరిక మేరకు అధికారులు భోజనం కాకుండా పండ్లు తెప్పించి ఇచ్చారు.
రోజూ ఉదయం పూట కవిత గీతా పారాయణం, యోగా చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు అంబేద్కర్, కరుణానిధి, రాం విలాస్ పాశ్వాన్ జీవిత చరిత్ర పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నారని తెలిపారు. కాగా, ఇతర కేసుల్లో బిజీగా ఉండడంతో అధికారులు కవితను బుధవారం ఉదయం 10 గంటల తర్వాత, లంచ్ తర్వాత కాసేపు ప్రశ్నించారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నాలుగో రోజు కూడా కేటీఆర్ కలిశారు. విచారణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటూ న్యాయపరంగా సహకారం అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో తీసుకుంటున్న స్టెప్స్ను వివరిస్తూ కవితకు ధైర్యం చెప్పారు.
కవిత ఇంట్లో సోదాల సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది, ఎమ్మెల్సీ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన పదహారు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి పాస్ వర్డ్స్ ను నమోదు చేసుకుంది. ఇందులో కవిత, ఆమె భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, పీఏ శరత్ కుమార్, స్టాఫ్ రోహిత్ రావు ఫోన్లను ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనా స్వాధీనం చేసుకుని, మిగతా ఫోన్లను పరిశీలించి తిరిగిచ్చేశారు. తాజాగా, కవిత విచారణ సందర్భంగా రాజేశ్, రోహిత్ రావు లను ఈడీ అధికారులు బుధవారం ప్రత్యేకంగా ప్రశ్నించారు.