YS Sharmila: దేశానికి బీజేపీ మంచిది కాదు.. ఏపీకి రాజధాని లేకపోవడం బాధాకరం: షర్మిల

BJP is not good for India says YS Sharmila

  • దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అన్న షర్మిల
  • దేశాన్ని అంబానీ, అదానీలకు దోచి పెట్టారని విమర్శ
  • బీజేపీ మోసం చేస్తున్నా జగన్, చంద్రబాబు మౌనంగా ఉన్నారని మండిపాటు

బీజేపీలో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడలో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి జై భారత్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. 

దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమని షర్మిల అన్నారు. దేశాన్ని అంబానీ, అదానీలకు దోచి పెట్టారని విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలు కూడా బీజేపీ మెప్పు కోసం పని చేస్తున్నాయని అన్నారు. ఏపీలో గంగవరం పోర్టును అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్ ను కూడా వీరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 

బీజేపీన విమర్శించే నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వాటిని ప్రయోగిస్తున్నారని... ఈ దాడులకు భయపడి బీజేపీపై ఇష్టం లేకపోయినా చాలామంది బీజేపీలో చేరుతున్నారని షర్మిల అన్నారు. చివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా కలుషితం చేశారని విమర్శించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని... ఆ తర్వాత దాన్ని విస్మరించిందని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. బీజేపీ మోసం చేస్తున్నా జగన్, చంద్రబాబు ఇద్దరూ మౌనం వహించారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా... రాజధాని లేకపోవడం బాధాకరమని అన్నారు.

  • Loading...

More Telugu News