Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు... ఉద్రిక్తత, ఏ క్షణమైనా అరెస్ట్?
- కేజ్రీవాల్ ఇంటికి సెర్చ్ వారెంట్‌తో వెళ్లిన 8 మంది ఈడీ అధికారులు
- కేజ్రీవాల్, భార్య, ఇతరుల ఫోన్లు సీజ్
- కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు
- కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు అనుమతి నిరాకరణ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద గురువారం సాయంత్రం హైడ్రామా నడుస్తోంది. ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి... ఇంట్లో సోదాలు చేస్తున్నారు. 8 నుంచి 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. కేజ్రీవాల్, ఆయన సతీమణి సహా ఇంట్లోని వారి ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. విచారణ అనంతరం ఏ క్షణంలో అయినా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఢిల్లీ మంత్రులను, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఈడీ అధికారులు అనుమతించలేదు. ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ కేజ్రీవాల్ ఇంటి వద్ద పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు కేజ్రీవాల్‌ను అధికారులు విచారించడం... అరెస్ట్ చేస్తారనే ఉద్దేశ్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, నాయకులు కేజ్రీవాల్ నివాసానికి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. తమ పార్టీని చూసి బీజేపీ భయపడుతోందని ఏఏపీ నేతలు మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను చూసేందుకు తమకు అవకాశం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖండించారు.
ఏం జరిగింది?
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు తొమ్మిదిసార్లు... కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ప్రతిసారి ఏదో కారణం చెప్పి ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో తనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికిప్పుడు ఈడీ చర్యల నుంచి, అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని ఢిల్లీ హైకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో ఆయన ఇంటికి చేరుకుని.. సోదాలు నిర్వహించారు. మరోవైపు, హైకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.