Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన బీఆర్ఎస్

BRS calls Arvind Kejriwal arrest unlawful and condemn it

  • అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానన్న కేటీఆర్
  • ఈడీ, సీబీఐ బీజేపీకి అణచివేత సాధనాలుగా మారిపోయాయని వ్యాఖ్య
  • కారణాలు లేకుండా ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపాటు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ స్పందించింది. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

బీజేపీ అణచివేతకు ఈడీ, సీబీఐలు ప్రధాన సాధనాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, రాజకీయ ప్రతీకారమే వారి ఏకైక ఉద్దేశమని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. కాగా ఇదే కేసులో కేటీఆర్ సోదరి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్‌తో సహా సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను పలు పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్‌, డీఎంకే, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీతో పాటు పలు విపక్ష పార్టీలు కేజ్రీవాల్‌ అరెస్టును తప్పుబట్టాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడం రాజకీయ కక్షసాధింపేనని ఆయా పార్టీలు వ్యాఖ్యానించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్‌ బలపడుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ పలు పార్టీల నేతలు బీజేపీపై మండిపడ్డారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News