Canary Islands: బీచ్‌లో గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై రూ. 2 లక్షల ఫైన్.. కెనరీ ఐల్యాండ్స్ నిర్ణయం

This Country Fines Tourists 2 Lakh For Picking Rocks From Its Beaches

  • పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన నిబంధనల అమలు
  • బీచ్‌లల్లోని గులకరాళ్లు, మట్టి పర్యావరణానికి కీలకమంటున్న అధికారులు
  • నిబంధనలు అమలు చేయడం కష్టమంటున్న పరిశీలకులు

స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం రాళ్లు, మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో అగ్నిపర్వత ధూళి, మట్టి కోల్పోతున్నాయని చెప్పారు. మిగిలిన రాళ్లను టూరిస్టులు తన పర్యటన తాలూకు గుర్తులుగా తీసుకెళుతుండటంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందని వెల్లడించారు. 

టూరిస్టుల రాకడ ఎక్కువవడంతో కెనరీ ఐలాండ్స్ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. ఓ హోటల్ అతథులకోసం స్థానికులు వినియోగించిన దానికంటే నాలుగు రెట్లు అధికంగా నీరు వినియోగిస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ద్వీపంలోని చాలా ప్రాంతాల్లో క్షామం తరహా పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక్కడి జనాభా 10 లక్షల మంది కాగా, టూరిస్టుల సంఖ్య దీనికి ఐదురెట్లు ఉంటుంది. దీంతో, అక్కడి వ్యవస్థలు కుప్పకూలే స్థితిలో ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు కఠినంగానే ఉన్నా వాటిని అమలు చేయడం అంత ఈజీ కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏ గులకరాయి ఎక్కడి నుంచి సేకరించారో గుర్తించడం దాదాపు అసాధ్యమని హెచ్చరిస్తున్నారు. 

కెనరీ ఐల్యాండ్స్ ఓ ద్వీపసముదాయం. ఇది స్పెయిన్‌లో స్వతంత్రప్రతిపత్తి కలిగిన ప్రాంతం. బీచ్‌లు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి గాంచింది. కెనరీ ఐలాండ్స్‌లో అతిపెద్ద ద్వీపం టెనెరీఫ్. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడీ టెనెరిఫ్‌లోనే ఉంది.

  • Loading...

More Telugu News