Arvind Kejriwal: కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం
- ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీని కోరుతూ ఈడీ పిటిషన్
- ఢిల్లీ మద్యం కొత్త విధాన రూపకల్పన కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగిందన్న ఈడీ న్యాయవాది
- ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని నమ్మవలసిన అవసరం లేదన్న కేజ్రీవాల్ న్యాయవాది
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు రిజర్వ్ చేసింది. కాసేపట్లో కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు నిన్న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
అరెస్టుకు దారి తీసిన పరిణామాలను... చట్టంలోని నిబంధనలను కోర్టుకు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని కోర్టుకు తెలిపారు. ఆయన కనుసన్నల్లోనే మద్యం కొత్త విధానం రూపకల్పన జరిగినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మనీష్ సిసోడియా ఎప్పుడూ కేజ్రీవాల్‌తో సంప్రదింపుల్లో ఉన్నట్లు చెప్పారు.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సిట్టింగ్ ముఖ్యమంత్రి, మంత్రులను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలు ఉంటే ఇక కస్టడీకి ఎందుకు అని ప్రశ్నించారు. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని నమ్మవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.