k laxman: నువ్వు గేట్లు ఎత్తి రాజకీయాలు చేస్తే, కరెంట్ సంగతి ఎవరు చూడాలి?: రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపాటు
- ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ అవతారం ఎత్తుతానని... గేట్లు ఎత్తుతానని రేవంత్ అనడంపై ఆగ్రహం
- కమీషన్లు రావనే ఎన్టీపీసీ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయడం లేదని ఆరోపణ
- కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారన్న బీజేపీ నేత
రేవంత్ రెడ్డీ.. నువ్వు గేట్లు ఎత్తి రాజకీయాలు చేస్తే, కరెంట్ సంగతి ఎవరు చూడాలి? అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వేసవి ప్రారంభం కాగానే విద్యుత్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. 100 రోజులుగా ముఖ్యమంత్రి హోదాలో రోజుకు 18 గంటలు పని చేశానని, ఇప్పుడు ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ అవతారం ఎత్తుతానని, గేట్లు ఎత్తుతానని రేవంత్ అంటున్నారని ధ్వజమెత్తారు. అలా అయితే కరెంట్ సమస్యలు ఎవరు చూసుకోవాలని నిలదీశారు.
కమీషన్లు రావనే ఉద్దేశంతో ఎన్టీపీసీ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకుంటే విద్యుత్‌ను వేరే రాష్ట్రానికి మళ్లిస్తామని ఎన్టీపీసీ హెచ్చరికలు చేస్తోందన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పులనే రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పడు ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.