Raghunandan Rao: పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు మెదక్ నుంచి అభ్యర్థి లేడు: రఘునందన్ రావు
- మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని ధీమా
- ప్రాజెక్టుల్లో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన మాజీ కలెక్టర్‌ను అభ్యర్థిగా ప్రకటించడం సిగ్గుచేటు అని వ్యాఖ్య
- బీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి కాకుండా సూట్‌కేసులు మోసేవాళ్లకు పదవులు ఇస్తున్నారని విమర్శ
పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా... పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు మెదక్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి కరవయ్యాడని మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం జిన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని నేడు గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం సిగ్గుచేటు అని విమర్శించారు.
ఆ పార్టీలో కష్టపడిన వారికి కాకుండా సూట్‌కేసులు మోసేవాళ్లకు పదవులు ఇచ్చారు... ఇస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పోల్‌కు కట్టేసి కొడతామని చెబుతున్నారన్నారు. దేశ ప్రజలందరూ తన కుటుంబసభ్యులని ప్రధాని మోదీ అంటుంటే... కేసీఆర్ మాత్రం కవిత, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్, వాళ్ల కుమారులే తన కుటుంబ సభ్యులని చెబుతారని ఎద్దేవా చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడైనా మెదక్ జిల్లాకు వచ్చారా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా మోదీని మూడోసారి ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు.