Nara Lokesh: మరోసారి ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు: మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ విజ్ఞప్తి
- మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా నారా లోకేశ్ ప్రచారం
- నేడు పలు ప్రాంతాల్లో రచ్చబండ సభలు
- ఆర్కేని రెండుసార్లు గెలిపించినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్న లోకేశ్
- దేశమంతా మంగళగిరి వైపు చూసేట్టు చేస్తానని హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు మంగళగిరి రూరల్ మండలం బేతపూడి, నవులూరు, తాడేపల్లి డోలాస్ నగర్ లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దని మంగళగిరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు... మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా?అని ప్రశ్నించారు.
"రెండు నెలల క్రితం ఆర్కే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ... జగన్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదని, అందుకే పార్టీ మారుతున్నానని చెప్పారు. కొండ, కాలువ పోరంబోకు, రైల్వే, అటవీ, దేవాదాయ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తానని అన్నారు. చేనేతలను ఆదుకుంటానని, మంగళగిరికి ప్రతి ఏడాది 2వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి? ప్రత్యేక నిధులు, ఇళ్ల పట్టాలు ఏమయ్యాయి?
ప్యాకేజి కుదిరాక మళ్లీ వైసీపీలో చేరి జగనంతటోడు లేడంటున్నారు. అందుకే ఆయనకు కరకట్ట కమలహాసన్ అని పేరుపెట్టా. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులకు మొదట ఓటేసింది ఆర్కేనే. ఆయన మాటలు నమ్మి మంగళగిరి ప్రజలు మరోసారి మోసపోవద్దు" అని లోకేశ్ స్పష్టం చేశారు.
దేశమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా
2019లో 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాను. అప్పుడు మీ సమస్యలు నాకు తెలియవు, నా గురించి మీకు తెలియదు. అయినా బేతపూడిలో నాకు మెజారిటీ ఇచ్చారు. ఏదేమైనా మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను.
రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాం. కాలువ, కొండ పోరంబోకు, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తాం.
కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన కరెంట్ ఛార్జీలు, పన్నుల భారం తగ్గిస్తాం.