Virat Kohli: టీ20 చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు
- మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ
- టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగులు పూర్తి
- తొలి భారత బ్యాట్స్ మన్ గా ఘనత
బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ చరిత్రలోనే 12 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఇవాళ ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కోహ్లీ 21 పరుగులు చేశాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 12,105 పరుగులు ఉన్నాయి.
ఓవరాల్ గా టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. ఇందులో అంతర్జాతీయ టీ20 పరుగులతో పాటు, ఫ్రాంచైజీ క్రికెట్లో చేసిన పరుగులు కూడా ఉన్నాయి.
ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ 14,562 పరుగులతో నెంబర్ వన్ గా ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ (13,360), వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ కైరన్ పొలార్డ్ (12,900), ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (12, 319), ఆసీస్ డైనమిక్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (12,065) ఉన్నారు.