Kate Middleton: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్‌కు క్యాన్సర్
- బ్రిటన్ రాజకుటుంబాన్ని వెంటాడుతున్న క్యాన్సర్
- తొలుత రాజు ఛార్లెస్ ఈ మహమ్మారి బారిన పడ్డట్టు వెల్లడి
- తానూ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్టు తాజాగా ప్రకటించిన యువరాణి కేట్
- ఉదరభాగంలో ఆపరేషన్ తరువాత టెస్టుల్లో క్యాన్సర్ బయటపడినట్టు వెల్లడి
- ప్రస్తుతం చికిత్స తొలి దశలో ఉందని చెప్పిన కేట్
బ్రిటన్ రాజ కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోంది. రాజు ఛార్లెస్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న తరుణంలోనే బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కూడా ఈ వ్యాధి బారినపడ్డట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. తను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న విషయాన్ని కేట్ స్వయంగా వీడియో సందేశంలో తెలిపారు. బ్రిటన్ సింహాసనానికి వారసుడు, యువరాజు విలియమ్స్ భార్య కేట్ అన్న విషయం తెలిసిందే.
కేట్ జనవరిలో ఉదరభాగంలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పట్లో రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే గడిపారు. ఆపరేషన్‌కు గల కారణాలు తెలియరానప్పటికీ అది క్యాన్సర్ సంబంధిత సమస్య కాదని మాత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో ఆమెకు క్యాన్సర్ ఉన్నట్టు వెల్లడైంది. దీంతో, వ్యాధి మరింత ముదరకుండా ప్రివెంటివ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని కేట్ తాజాగా తెలిపారు. ‘‘నా మెడికల్ టీం సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నా. ఈ ట్రీట్‌మెంట్ ప్రస్తుతం తొలి దశలో ఉంది’’ అని చెప్పారు. క్యాన్సర్ ఉందని తెలిసి తను, తన భర్త చాలా షాక్‌కు గురయ్యామని కేట్ అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని కూడా చెప్పారు. ఇక ఈస్టర్ తర్వాతే కేట్ తన రాచరిక విధుల్లో పాల్గొంటారని రాజభవనం ఓ ప్రకటనలో తెలిపింది.
బ్రిటన్ రాజు ఛార్లెస్ కూడా క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ అప్పట్లో ప్రకటించింది. కేట్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలోనే ఆయన జనవరిలో ప్రొస్ట్రేట్ గ్రంధి సమస్యకు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం రాజు ఛార్లెస్ క్రమంగా కోలుకుంటున్నారు. కేట్ క్యాన్సర్ వార్తపై స్పందించిన రాజు ఈ క్లిష్ట సమయంలో ఆమె ధైర్యసాహసాలను ప్రశంసించారు.