PM Narendra Modi: రష్యాలో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
- రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదుల నరమేధం
- 60 మందికి పైగా మృత్యువాత, మరో 140 మందికి గాయాలు
- ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
- ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటన
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల నరమేధానికి పాల్పడ్డారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 140 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలియజేశారు.
"మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు, ప్రార్థనలు వారితోనే ఉంటాయి. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటాం" అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.