Arvind Kejriwal: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 10 కుంభకోణాలు చేశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే: సుఖేష్ చంద్రశేఖర్
- తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
- తీహార్ క్లబ్‌కు స్వాగతమంటూ వ్యంగ్యాస్త్రాలు
- కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతుందున్న సుఖేష్
- త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతానంటూ లేఖలో వెల్లడి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై తాజాగా స్పందించాడు. ఈ సందర్భంగా సుఖేష్ శనివారం ఓ లేఖ రాశాడు. "ఆలస్యమైనా చివరకు నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్‌కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. తీహార్ క్లబ్‌కు మీకు స్వాగతం. ఖట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు తెరపడింది. త్వరలోనే కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలకు పాల్పడ్డారు. అందులో నాలుగింటికి నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతా" అని సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో రాసుకొచ్చాడు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. శుక్రవారం ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. దాంతో న్యాయస్థానం ఆరు రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు, నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అటు ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా ఢిల్లీ సీఎం అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టు అప్రజాస్వామికమని కూటమి పార్టీలు పేర్కొన్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి ఇండియా కూటమి సిద్ధమైంది.