Delhi Liquor Scam: కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ సంచలన ఆరోపణలు
- అరబిందో ఫార్మా డైరెక్టర్ అరెస్టు విషయాన్ని ప్రస్తావించిన ఆప్
- కేజ్రీవాల్ ను కలవలేదని అన్నందుకు అరెస్టు..
- లిక్కర్ స్కాంపై కేజ్రీవాల్ తో మాట్లాడానన్న మరుసటి రోజే బెయిల్
- ఈ కేసులో మనీ ట్రయల్ మొత్తం బీజేపీతోనే లింక్ ఉందని అతిషి ఆరోపణ
- ఎలక్టోరల్ బాండ్ విరాళాల డేటా పరిశీలిస్తే తెలుస్తుందని కామెంట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందినట్లు చెబుతున్న రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడని తెలిపారు. అదికూడా ఈ కేసులో అరెస్టులు జరుగుతున్న సమయంలోనే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడాన్ని అతిషి ప్రస్తావించారు.
శరత్ చంద్రారెడ్డి అరెస్టు, బెయిల్ కూడా నాటకీయంగా జరిగిందని మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ తో తనకు పరిచయమే లేదన్న మరుసటి రోజే ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారని, నెలల తరబడి జైలులో ఉన్న శరత్ చంద్రారెడ్డి తన స్టేట్ మెంట్ మార్చారని చెప్పారు. లిక్కర్ పాలసీ విషయంలో కేజ్రీవాల్ ను కలిసి మాట్లాడానని స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాతే ఆయనకు బెయిల్ మంజూరైందని చెప్పారు. శరత్ చంద్రా రెడ్డికి 2022 నవంబర్ 9న ఈడీ సమన్లు పంపిందని, కేజ్రీవాల్ తో కానీ, ఆప్ తో కానీ తనకెలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టంగా చెప్పారని అతిషి తెలిపారు.
దీంతో ఆ మరుసటి రోజే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారన్నారు. తన స్టేట్ మెంట్ మార్చుకున్న వెంటనే ఆయనకు బెయిల్ వచ్చిందని గుర్తుచేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో అరబిందో ఫార్మా కంపెనీ సుమారు రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిందని మంత్రి అతిషి వివరించారు. ఇందులో సింహభాగం.. అంటే 66 శాతం నిధులు బీజేపీకే అందాయని ఎలక్టోరల్ బాండ్స్ వివరాల ద్వారా బయటపడిందని అతిషి పేర్కొన్నారు.