Ruturaj Gaikwad: ఎలాంటి ఒత్తిడి లేదు.. ప్ర‌తిక్ష‌ణం కెప్టెన్సీని ఆస్వాదించాను: రుతురాజ్ గైక్వాడ్‌

Did not Feel Any Pressure Says Ruturaj Gaikwad After Making Winning Debut On Captaincy

  • తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా జ‌ట్టుకు విజ‌యం అందించిన రుతురాజ్‌
  • ఒక్క క్ష‌ణం కూడా కెప్టెన్సీ భారంగా అనిపించ‌లేద‌న్న యువ ఆట‌గాడు
  • అంద‌రి స‌మష్టి కృషితోనే తొలి మ్యాచ్‌లో గెలిచామ‌న్న కొత్త సార‌ధి

టోర్నీ ప్రారంభానికి కేవ‌లం ఒక్క రోజు ముందు మ‌హేంద్ర సింగ్ ధోనీ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) ప‌గ్గాలు అందుకున్నాడు యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌. ఇక శుక్ర‌వారం జ‌రిగిన ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో తొలిసారి కెప్టెన్‌గా బ‌రిలోకి దిగాడు. ఇలా కెప్టెన్సీ చేప‌ట్టిన మొద‌టి మ్యాచ్‌లోనే ఈ 27 ఏళ్ల సార‌ధి జట్టుకు విజ‌యాన్ని కూడా అందించాడు. బెంగ‌ళూరుతో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ మొద‌లుకొని మ్యాచ్ మొత్తంలో ఎక్క‌దా ఒత్తిడికి గురి కాలేదు. కెప్టెన్‌గా పూర్తి స్వేచ్ఛ‌తో సరైన నిర్ణ‌యాలు తీసుకున్నాడు. మ‌రోవైపు మాజీ కెప్టెన్ ధోనీ కూడా రుతురాజ్‌కు పూర్తి స‌హ‌కారం అందించాడు. 

మ్యాచ్ అనంత‌రం కెప్టెన్సీ విష‌య‌మై రుతురాజ్ స్పందించాడు. ఒక్క క్ష‌ణం కూడా కెప్టెన్సీ భారంగా అనిపించ‌లేద‌ని చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. "ప్ర‌తిక్ష‌ణం కెప్టెన్సీని ఆస్వాదించాను. అద‌నంగా ఎలాంటి భారం అనిపించ‌లేదు. ఏ విష‌యంలోనూ ఒక్క క్ష‌ణం కూడా ఒత్తిడికి గురి కాలేదు. పైగా మ‌హీ భాయ్ కూడా నాతో ఉన్నాడు" అని కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్ వికెట్లు వెంట‌వెంట‌నే ప‌డ‌డం మ్చాచ్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని రుతురాజ్ అన్నాడు. ఆ త‌ర్వాత ఐదారు ఓవ‌ర్లు మ్యాచును బాగా కంట్రోల్ చేయ‌డానికి ఈ రెండు వికెట్లు తోడ్ప‌డ్డాయ‌ని పేర్కొన్నాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను క్రీజులోకి వ‌చ్చిరాగానే దీప‌క్ చాహర్ పెవిలియ‌న్‌కు పంపించ‌డం బాగా కలిసొచ్చింద‌న్నాడు. 

కాగా, ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఆర్‌సీబీ ఒకానొక ద‌శ‌లో 78 ప‌రుగుల‌కే 5 కీల‌క వికెట్లు పారేసుకుని పీక‌ల‌లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులో కుదురుకున్న అనుజ్ రావ‌త్‌, దినేష్ కార్తీక్ ద్వ‌యం ఏకంగా 95 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో బెంగ‌ళూరు జట్టుకు 173 ప‌రుగుల భారీ స్కోర్ అందించింది. 

ఆ త‌ర్వాత 174 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై 18.4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చాలా సులువుగా ఛేదించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ర‌చిన్ ర‌వీంద్ర (37), శివం దుబే (34), ర‌హానే (27), ర‌వీంద్ర జ‌డేజా (25) రాణించారు. ఇలా స‌మష్టి కృషితోనే ఈ విజ‌యం సాధ్య‌మైంద‌ని రుతురాజ్ తెలిపాడు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విజ‌యంలో త‌మ పాత్ర పోషించార‌ని తెలిపాడు. అయితే, టార్గెట్ ఛేద‌న స‌మ‌యంలో త‌మ జ‌ట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై కొంచెం దృష్టిసారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు.

  • Loading...

More Telugu News