Chandrababu: ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాయం: చంద్రబాబు ధీమా
- ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు
- అందుకే అందరికీ న్యాయం చేయలేకపోయామన్న చంద్రబాబు
- చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడి
- కూటమికి చెందిన ప్రతి అభ్యర్థి గెలవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటన
సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా... టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా... టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు.
మూడు పార్టీల పొత్తు అనంతరం అన్ని విషయాలు లోతుగా పరిశీలించిన మీదటే అభ్యర్థుల ఎంపిక చేశామని, బరిలో దింపే ప్రతి అభ్యర్థి గెలవాలన్నదే కూటమి లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో మూడు పార్టీల కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి 400కి పైగా లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు.
అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఎన్డీయే అభ్యర్థిగానే చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడు పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవితకు నాంది అని ఉద్ఘాటించారు.