Anna Rambabu: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదు
- ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలు
- గీత దాటిన ఎమ్మెల్యేలపై చర్యలు
- ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ పనులకు అన్నా రాంబాబు హాజరైనట్టు గుర్తింపు
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక సీఈవో ముఖేశ్ కుమార్ మీనా నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా వ్యవహరిస్తోంది. తాజాగా, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదైంది. అన్నా రాంబాబు, మరికొందరు వైసీపీ నేతలు ఈ నెల 18న షాదీఖాన్ శ్లాబ్ పనుల్లో పాల్గొన్నారని, ఇది కోడ్ ఉల్లంఘించడమేనని రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు నోటీసులు పంపారు.
ఇటీవల, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపైనా కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు రాచమల్లుపై కేసు నమోదు చేశారు.