Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు... కేసులో కీలకంగా వ్యవహరించిన మేక శరణ్?
- కవిత సమీప బంధువు మేక శరణ్ నివాసంలోనూ ఈడీ సోదాలు
- కవితను అరెస్ట్ చేసిన రోజు ఆమె ఇంట్లోనే ఉన్న మేక శరణ్
- అతని ఫోన్ సీజ్ చేసిన ఈడీ అధికారులు
ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువు మేక శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మేక శరణ్, మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు.
మేక శరణ్‌ను ఇదివరకే రెండుసార్లు ఈడీ విచారణకు పిలిచింది. కానీ అతను హాజరుకాలేదు. సౌత్ లాబీ లావాదేవీల్లో అతను కీలకపాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపుల వ్యవహారంలో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఈరోజు మొత్తం ఏడుగురు ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.