V Hanumantha Rao: రేవంత్ రెడ్డీ.. నీస్థాయిని నీవే తగ్గించుకుంటున్నావ్... ఇవన్నీ చెబుదామంటే టైమ్ ఇవ్వడంలేదు: వీహెచ్ షాకింగ్ కామెంట్స్

VH shocking comments on Revanth Reddy

  • బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం సరికాదన్న వీహెచ్
  • వారిని పార్టీలోకి తీసుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి
  • పార్టీని తక్కువ సమయంలో బలోపేతం చేసి నాలుగేళ్లలో సీఎం అయ్యారంటూ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు

రేవంత్ రెడ్డీ... బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి... నీ స్థాయిని నీవు తగ్గించుకుంటున్నావ్ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్‌ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. వారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయవద్దని కోరారు. రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదన్నారు. ఆయన తనస్థాయిని తాను తగ్గించుకుంటున్నారన్నారు.

ఇవన్నీ చెబుతామంటే టైమ్ ఇవ్వడం లేదు

రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కూడా కురిపించారు. తక్కువ సమయంలో పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించింది రేవంత్ రెడ్డేనని... అలాగే కేవలం నాలుగేళ్ళలోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా ఆయనే అని కొనియాడారు. అలాంటి నీవు... ముఖ్యమంత్రివి అయి ఉండి వారి వద్దకు వెళ్లి ఆహ్వానించడం సరికాదన్నారు.

బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్లు మన వైపు వస్తున్నారని పార్టీ మారుతున్న నేతలను ఉద్దేశించి వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, వీటిని ఎత్తివేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలని కోరారు. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకూడదనేది తన ఉద్దేశ్యం అన్నారు.

  • Loading...

More Telugu News