Revanth Reddy: కాంగ్రెస్‌లో తరం మార్పు మొదలైంది.. రేవంత్‌రెడ్డిని చూడండి.. జైరాం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తరం మార్పు కోసం కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోందన్న సీనియర్ నేత
- తెలంగాణలో కొత్త వారిని బరిలోకి దింపడమే విజయానికి కారణమన్న పార్టీ ప్రధాన కార్యదర్శి
- కొత్త తరం, పాత తరం మధ్య సమన్వయం అవసరమన్న జైరాం
- రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ తరం మార్పిడి మొదలైందన్న నేత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘తరం మార్పు’ ఇప్పుడు కనిపిస్తోందని, అందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డే ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌లోకి కొత్తవారు వస్తున్నారని, వారిని రంగంలో నిలపడమే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ తరం మార్పిడి మొదలైందని జైరాం రమేశ్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తాయని పేర్కొన్నారు. పార్టీ 70 ఏళ్ల వ్యక్తుల నుంచి 50 ఏళ్ల వ్యక్తుల తరానికి వెళ్తోందని చెప్పుకొచ్చారు. పార్టీలోని అనుభవజ్ఞులకు, కొత్త తరానికి మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే, బీజేపీకి ఇలాంటి సమస్యలు లేవన్న ఆయన.. ఆ పార్టీ ఇంకా చాలా రాష్ట్రాలలో ప్రారంభంలోనే ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను తీసి పారేయడం అంత ఈజీ కాదన్న జైరాం రమేశ్.. కచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మనుగడ కోసమే పోటీ చేస్తుందని అన్నారని, కానీ అధికారంలోకి వచ్చి చూపించామని ఆయన గుర్తు చేశారు.