Tamilisai: తమిళిసై వర్సెస్ తమిళచ్చి.. చెన్నై సౌత్ లో ఆసక్తికర ఫైట్
- లోక్ సభ బరిలో బీజేపీ నుంచి తమిళిసై
- సీనియర్ నేత తమిళచ్చిని నిలబెట్టిన డీఎంకే
- గత ఎన్నికల్లో చెన్నై సౌత్ లో తమిళచ్చికి 1.40 లక్షల ఓట్ల మెజారిటీ
గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరిన తమిళిసై సౌందరరాజన్ ను పార్టీ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, డీఎంకే నేత తమిళచ్చి తంగపాండియన్ కే ఆ పార్టీ మరోసారి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలో తమిళిసై, తమిళచ్చిల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, అన్నాడీఎంకే పార్టీ నుంచి డాక్టర్ జయవర్థన్ పోటీ చేస్తున్నారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్థన్.. 2019 లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచారు.
తమిళచ్చి తంగపాండియన్ తమిళనాడు అధికార పార్టీ సీనియర్ నేత, మంత్రి తంగం తెన్నరసు సోదరి. చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజీలో లెక్ఛరర్ గా పనిచేసిన తమిళచ్చి మంచి రచయిత్రి కూడా. పారిస్ ప్యారిస్ చిత్రానికి ఆమె డైలాగులు రాశారు. సోదరుడి సహకారంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, చెన్నై సౌత్ నుంచి భారీ మెజారిటీతో లోక్ సభలో అడుగు పెట్టారు. చెన్నై సౌత్ నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్న తమిళచ్చి తంగపాండియన్ కు పలు సానుకూలతలు ఉన్నాయి. అధికార పార్టీ కావడంతో పాటు ఇండియా కూటమి సహకారంతో ఈజీగా విజయం అందుకుంటానని తమిళచ్చి దీమాగా ఉన్నారు.