Beggars attack: విజయవాడలో రణరంగం సృష్టించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్.. పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి!
- తాగొచ్చి బస్టాండ్‌లో బెంచీలు ఆక్రమించుకుని నిద్రించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్
- ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది యత్నం
- ఒక్కసారిగా రెచ్చిపోయిన నిందితులు, ఏకంగా వంద మంది దాడికి దిగిన వైనం
- అదనపు పోలీసు బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి, నిందితుల్లో కొందరి అరెస్టు
విజయవాడలోని పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం తాగిన కొందరు యాచకులు, బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్‌లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది వెళ్లారు. యాచకులను నిద్రలేపేందుకు ప్రయత్నించగా వారు దాడికి దిగారు. ఒక్కసారిగా సుమారు వంద మంది యాచకులు, బ్లేడ్ బ్యాచ్ దాడికి యత్నించారు.
బ్లేడ్లతో దాడికి పాల్పడటంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ క్రమంలో సాంబయ్య అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలు కూడా అయ్యాయి. ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈలోపు అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. కొందరిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, రైల్వేస్టేషన్‌కు రానివ్వకపోవడంతో వారందరూ బస్టాండ్‌కు వస్తున్నారని స్థానికులు కొందరు తెలిపారు.