Maldives: భారత్ విషయంలో మొండి వైఖరి వద్దు.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు మాజీ అధ్యక్షుడు సూచన

Stop Being Stubborn says Maldives Ex President Ibrahim Mohamed Solih

  • భారత్ సాయం చేస్తుందనే నమ్మకం ఉందన్న మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఇబ్రహీం సోలెహ్
  • మొండి వైఖరిని పక్కన పెట్టి చర్చలు జరపాలని సూచన
  • భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మొండి వైఖరిని విడనాడాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ సూచించారు. దేశ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పొరుగు దేశాలతో చర్చలు జరపాలని సలహా ఇచ్చారు. చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ.. రుణ విముక్తికి సహకరించాలంటూ భారత్‌ను ఇటీవల ముయిజ్జు అభ్యర్థించిన నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవులు చైనాకు 18 బిలియన్ డాలర్ల రుణం, భారత్‌కు 8 బిలియన్ల డాలర్ల రుణం చెల్లించాల్సి ఉందని, 25 ఏళ్ల వ్యవధిలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని సోలిహ పేర్కొన్నారు. పొరుగు దేశమైన భారత్‌ సాయం చేస్తుందనే నమ్మకం ఉందని, మొండి వైఖరిని పక్కన పెట్టి చర్చలు జరపాలని కోరారు. మాల్దీవులకు సాయం చేయడానికి భాగస్వామ్య దేశాలు ఉన్నాయని, అయితే ముయిజ్జు రాజీ పడటానికి ఇష్టపడరంటూ ఇబ్రహీం సోలిహ్ విమర్శించారు.

దేశ రుణ పునరుద్ధరణ కోసం భారత్‌తో చర్చించాలని ముయిజ్జు భావిస్తున్నట్టుగా మీడియా కథనాలను తాను చేశానని, ఆ దిశగా అడుగులు వేయాలని ఇబ్రహీం సోలిహ్ సూచించారు. దేశ ఆర్థిక సవాళ్లు భారత్ రుణాలవల్ల కాదని ఈ సందర్భంగా సోలిహ్ పేర్కొన్నారు. మాల్దీవులలోని మాఫన్నులో 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఇబ్రహీం సోలిహ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్‌ నెలలో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం మహ్మద్‌పై 45 ఏళ్ల ముయిజు విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News