JNU: ఢిల్లీ జేఎన్‌యూ స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా దళిత విద్యార్థి ధనంజయ్

JNU Gets Its 1st Dalit Student President Since 1996
  • వామపక్ష విద్యార్థి సంఘాల మద్దతుతో ధనంజయ్ గెలుపు
  • ఏబీవీపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఉమేశ్ అజ్మీరా 
  • 1996 తర్వాత జేఎన్‌యూ తొలి దళిత ప్రెసిడెంట్‌గా గుర్తింపు
ఆదివారం జరిగిన జేఎన్‌యూఎస్‌యూ (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్) ఎన్నికల్లో దళిత విద్యార్థి ధనంజయ్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. వామపక్షాలకు చెందిన విద్యార్థి సంఘాల మద్ధతుతో ఆయన విజయం సాధించారు. దీంతో 1996 తర్వాత జేఎన్‌యూ విద్యార్థుల యూనియన్ అధ్యక్షుడిగా గెలిచిన తొలి దళిత విద్యార్థిగా ధనంజయ్ నిలిచారు. బీజేపీ అనుబంధ ఏబీవీపీ తరపున ఉమేశ్ అజ్మీరా పోటీ పడ్డారు. అజ్మీరాకు 1,676 ఓట్లు పడగా.. అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) నుంచి పోటీ చేసిన ధనంజయ్‌కు 2,598 ఓట్లు పడ్డాయి. దీంతో ఘన విజయం సాధించారు.

ధనంజయ్ బీహార్‌లోని గయాకు చెందిన విద్యార్థి. జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌(సౌందర్యశాస్త్రం)లో  పీహెచ్‌డీ చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు తీసుకుంటున్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ (HEFA) రుణాల కారణంగా విద్యార్థులపై ఫీజుల భారాలు పెరిగిపోతున్నాయంటూ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ధనంజయ్ చేసిన ప్రసంగం విద్యార్థులను ఆకట్టుకుంది. క్యాంపస్‌లో నీరు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీలు కూడా ఇచ్చారు. మరోవైపు దేశద్రోహ ఆరోపణల కింద అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని ధనంజయ్ డిమాండ్ చేశారు. కాగా ధనంజయ్ కంటే ముందు 1996-97లో బట్టీ లాల్ బైర్వా జేఎన్‌యూ విద్యార్థుల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
JNU
JNUSU
Dhananjay

More Telugu News