Wayanad: వయనాడ్ లో రాహుల్ పై సురేంద్రన్ పోటీ.. బీజేపీ కేరళ చీఫ్ సురేంద్రన్ గురించి కొన్ని వివరాలు!
- 2009 నుంచి వయనాడ్ లో గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్
- 2019లో వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ
- శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సురేంద్రన్
కేరళలోని హై ప్రొఫైల్ లోక్ సభ స్థానం వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ పోటీ చేయనున్నారు. వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. 2009 నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. 2019లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు.
దక్షిణాదిలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ... రాహుల్ పై ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని బరిలోకి దింపింది. కేరళలో వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ - వామపక్షాలు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ... కేరళలో మాత్రం విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.
2019 లోక్ సభ ఎన్నికల్లో పత్తనంతిట్ట నియోజకవర్గం నుంచి సురేంద్రన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్, కమ్యూనిస్టుల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్ కేవలం 89 ఓట్లతో ఓడిపోయారు. 2019 బైపోల్స్ లో కూడా పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. 2020లో కేరళ బీజేపీ చీఫ్ గా ఆయన నియమితులయ్యారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన... ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఈ పోరాటం ద్వారా ఆయన పాప్యులారిటీ కేరళలో బాగా పెరిగింది.
కోజికోడ్ కు చెందిన సురేంద్రన్ పేరును బీజేపీ తన ఐదవ జాబితాలో ప్రకటించింది. ఇదే జాబితాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ తదితరుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అభిజిత్ గంగోపాధ్యాయ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బీజేపీలో చేరారు.
కేరళలో అగ్రనేతలు పోటీ పడుతున్న లోక్ సభ స్థానాల్లో వయనాడ్ తో పాటు తిరువనంతపురం ఉంది. తిరువనంతపురంలో మూడు సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన శశి థరూర్ తో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇప్పుడు పోటీ పడుతున్నారు.