Venkatesh: ఆ హీరో చేయవలసిన పాత్ర శ్రీకాంత్ చేశాడు: దర్శకుడు ముప్పలనేని శివ
- 'సంక్రాంతి' సినిమా నేపథ్యం చెప్పిన దర్శకుడు
- సురేశ్ బాబు ముందుగా ఒప్పుకోలేదని వ్యాఖ్య
- శ్రీకాంత్ చేస్తాడనుకోలేదని వెల్లడి
- ఆ పాత్రకి వడ్డే నవీన్ ను అనుకున్నానని వివరణ
ముప్పలనేని శివ పేరు వినగానే 'తాజ్ మహల్' .. 'కోరుకున్న ప్రియుడు' .. 'ప్రియా ఓ ప్రియా' .. 'సంక్రాంతి' .. 'రాజా' వంటి సూపర్ హిట్లు గుర్తుకొస్తాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'రాజా' 25 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా 'ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముప్పలనేని శివ మాట్లాడారు. "నా 30 ఏళ్ల కెరియర్ లో నేను ఎవరి ఆఫీసుకి వెళ్లి అవకాశాన్ని అడగలేదు. నా దగ్గరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాను అంతే" అని చెప్పారు.
'సంక్రాంతి' సినిమాకి సంబంధించిన కథను నేను సురేశ్ గారికి ఇచ్చాను. ఇప్పుడు ఇలాంటి సినిమాలను ఆడియన్స్ చూసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. 'ఒకసారి కథ చూడండి .. నచ్చితేనే చేద్దురుగానీ' అని నేను అన్నాను. ఆ తరువాత నాలుగైదు రోజులకు నాకు కాల్ వచ్చింది .. వెంకటేశ్ గారికి కథ నచ్చిందని. ఆ కథ వెంకటేశ్ గారికి నచ్చుతుందని నేను అనుకున్నాను .. అలాగే జరిగింది. అలా ఆ సినిమా పట్టాలెక్కింది" అని అన్నారు.
'సంక్రాంతి' సినిమాలో వెంకటేశ్ తమ్ముడి పాత్రను వడ్డే నవీన్ తో చేయించాలని అనుకున్నాను. కానీ ఆ పాత్రను శ్రీకాంత్ చేస్తే బాగుంటుందని వెంకటేశ్ అన్నారు. అయితే ముగ్గురు .. నలుగురు హీరోల్లో ఒకరిగా శ్రీకాంత్ చేస్తాడో లేదోనని అనుకున్నాను. కానీ ఆయన ఒప్పుకున్నారు. ఆ సినిమా చూసిన తరువాత శ్రీకాంత్ గారి ఫాదర్ నన్ను గట్టిగా హత్తుకున్నారు. అంతగా ఆ సినిమా వాళ్లకి నచ్చింది" అని అన్నారు.