Gautam Adani: మరో పోర్టును సొంతం చేసుకున్న అదానీ
- గోపాల్ పూర్ పోర్టును కొనుగోలు చేసిన అదానీ
- రూ. 3,350 కోట్లకు అమ్మినట్టు ప్రకటించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూపు
- ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగానే పోర్టును విక్రయించినట్టు వెల్లడి
భారత దేశ శ్రీమంతుడు గౌతమ్ అదానీ మరో పోర్టును సొంతం చేసుకున్నారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన గోపాల్ పూర్ పోర్టును ఆయన కొనుగోలు చేశారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ కు గోపాల్ పూర్ పోర్టును విక్రయించినట్టు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఈరోజు ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా ఈ పోర్టును రూ. 3,350 కోట్లకు అమ్మినట్టు తెలిపింది.
2017లో ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ పోర్టును పల్లోంజీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. పెట్రోనెట్ ఎల్ఎన్జీతో ఇటీవలే ఈ పోర్టు గ్రీన్ ఫీల్డ్ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. కొంత కాలం క్రితమే పల్లోంజీ గ్రూప్ మహారాష్ట్రలోని ధరమ్ తర్ పోర్టును రూ. 710 కోట్లకు జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్ కు విక్రయించింది. 2015లో ఈ పోర్టును కొనుగోలు చేసిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ దాని సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచింది.