Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం అదే: సోదరి శ్రీదేవి
- ఉదయ్ కిరణ్ చాలా టాలెంటెడన్న సిస్టర్ శ్రీదేవి
- రెండో సినిమాతో స్టార్ హీరో అనిపించుకున్నాడని వెల్లడి
- చివర్లో అతని సినిమాలు సరిగ్గా ఆడలేదని వివరణ
- ఆ అసంతృప్తియే అతణ్ణి దూరం చేసిందని ఆవేదన
ఉదయ్ కిరణ్ .. 'చిత్రం' సినిమాతో హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత వరుస హిట్లతో ముందుకు వెళ్లాడు. అప్పట్లో ఆయన సినిమాలు చాలావరకూ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి ఉదయ్ కిరణ్ పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రీసెంటుగా ఆయన సినిమా 'నువ్వు నేను' రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిస్టర్ శ్రీదేవి ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు.
" ఉదయ్ కిరణ్ చాలా టాలెంటెడ్ .. రెండో సినిమాతోనే స్టార్ అనిపించుకున్నవాడు. తమ్ముడి సినిమాను మళ్లీ థియేటర్ లో చూస్తానని నేను అనుకోలేదు. అలాంటి అవకాశాన్ని 'నువ్వు నేను' రీ రిలీజ్ కల్పించింది. సినిమా చూస్తున్నంత సేపు, ఉదయ్ కిరణ్ నాతో పాటు థియేటర్లోనే ఉన్నాడనే భావనలోనే ఉన్నాను. ఇంతకాలమవుతున్నా అతన పట్ల అందరూ చూపుతున్న అభిమానం నాకు చాలా ఆనందాన్ని .. ఆశ్చర్యాన్ని కలిగించింది" అని అన్నారు.
'' ఉదయకిరణ్ చివరిగా చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ముఖ్యంగా 'శ్రీరామ్' సినిమాపై అతని అంచనాలు దెబ్బతిన్నాయి. ఆ విషయంలో అతను చాలా డీలాపడిపోయాడు. సక్సెస్ లు .. ఫెయిల్యూర్ లు సహజం .. వాటిని గురించి అంతగా ఆలోచించకు అని నేను చెప్పాను కూడా. అయినా ఆ నిమిషంలో అతను ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతను చనిపోవడానికి కారణం, తన సినిమాలు ఆడటం లేదనే ఒక అసంతృప్తినే" అని చెప్పారు.