Anam Venkata Ramana Reddy: ఆ కుటుంబాలకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి.. ఆ తర్వాతే ఓట్లు అడగాలి: ఆనం
- వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారన్న ఆనం వెంకటరమణారెడ్డి
- ఆయన గురించి ఏం తెలుసని విజయసాయి మాట్లాడుతున్నారని ప్రశ్న
- దొంగసారా, నాసిరకం బియ్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
- బిల్లులు చెల్లించాకే జగన్ సిద్ధం సభలు పెట్టుకోవాలని డిమాండ్
టీడీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురించి ఏం తెలుసని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బియ్యం వల్ల ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగసారాతో చనిపోయిన వారి కుటుంబాలకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పిన తర్వాత ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
పీఎల్‌ఆర్ కనస్ట్రక్షన్స్‌కు ఆరు నెలల్లో బిల్లులన్నీ చెల్లించారని, కానీ గతేడాది జులై నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు నిలిచిపోయాయని ఆనం తెలిపారు. ఎంఎస్ఎంఈలకు నెలన్నరలోనే చెల్లింపులు చేయాలన్న నిబంధనలున్నాయని, కానీ వాటిని తుంగలో తొక్కి చెల్లింపులు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్ ముద్దుబిడ్డ అయిన పీఎల్‌ఆర్ కనస్ట్రక్షన్స్, విశ్వేశ్వరరెడ్డి షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు మాత్రం వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన పనులు, వైసీపీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించిన తర్వాతే జగన్ సిద్ధం సభలు పెట్టాలని ఆనం డిమాండ్ చేశారు.