Swamy Paripoornananda: హిందూపురం ఎంపీ, అసెంబ్లీ బరిలో ఇండిపెండెంట్ గా స్వామి పరిపూర్ణానంద!
- బీజేపీ నుంచి తనకు టికెట్ రాకుండా చంద్రబాబు చేశారని వ్యాఖ్య
- మైనార్టీ ఓట్లు పడవనే భావనతో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న పరిపూర్ణానంద
- ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టామని వెల్లడి
ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. హిందూపురం లోక్ సభ, అసెంబ్లీ స్థానాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. హిందూపురం బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తన పేరును ఖరారు చేసిందని... అయితే, తనకు టికెట్ రాకుండా చంద్రబాబు చేశారని అన్నారు. కూటమిలో భాగంగా మైనార్టీ ఓట్లు ఎక్కడ పడవో అనే అనుమానంతో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టామని... ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు.
దక్షిణ భారతదేశంలో హిందూపురంది గొప్ప స్థానమని పరిపూర్ణానంద అన్నారు. హిందూపురం పేరులోనే హిందూ ఉందని... అందుకే హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మరోవైపు హిందూపురం శాసనసభ అభ్యర్థిగా బాలకృష్ణ, లోక్ సభ అభ్యర్థిగా బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు.