Chandrababu: చేయడానికి పని లేనప్పుడే యువత వ్యసనాలకు బానిసలవుతారు: చంద్రబాబు
- కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
- యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం
- తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు వెల్లడి
- ఈ ప్రభుత్వం మటన్ కొట్లలో ఉద్యోగాలు ఇస్తోందని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పంలో యువత కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
తాను యువతకు ఐటీ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కల్పిస్తే... ఈ ప్రభుత్వం మటన్ కొట్లు, ఫిష్ మార్ట్ ల్లో ఉద్యోగాలు అంటోందని చంద్రబాబు విమర్శించారు. యువతకు చేయడానికి చేతినిండా పనిలేనప్పుడే వారు వ్యసనాల బాట పడతారని, చేయడానికి పనేమీ లేకపోతే ఓ క్వార్టర్ వేసుకుందామని అనుకుంటున్నారని వివరించారు.
"ప్రపంచం అమితవేగంతో మారిపోతోంది. ఒకప్పుడు కరెంట్ అంటే ఏంటో తెలియదు... ఇప్పుడు ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి. తెలుగు యువత బంగారుబాటలో నడవాలి. నేటి యువత వివేకానందుడ్ని ఆదర్శంగా తీసుకోవాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
"రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు రావడంలేదు. యువతకు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. చివరికి ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది... అందుకు గ్రూప్-1 నియామకాల వ్యవహారమే నిదర్శనం. అది ఉద్యోగాలు అమ్ముకోవడం కాదు... యువత భవిష్యత్తునే అమ్మేస్తున్నారు. కష్టపడి చదివే యువత జీవితాలతో వీళ్లు చెలగాటమాడుతున్నారు. జగన్ ను, అప్పటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ను ఖబడ్దార్ జాగ్రత్త అని ఇప్పటికే హెచ్చరించాను. కానీ వీళ్లు ఇలాంటి హెచ్చరికలకు భయపడరు. అందుకే, యువత తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపించాలి" అని పిలుపునిచ్చారు.