Baltimore Key Bridge: అమెరికాలో ఓడ ఢీకొని కుప్పకూలిన బాల్టిమోర్ బ్రిడ్జి... ఎక్కడ చూసినా ఇవే వీడియోలు!

Huge Cargo Vessel collides Baltimore Key Bridge as it collapsed into river

  • పటాప్ స్కో నదిపై దుర్ఘటన
  • బాల్టిమోర్ కీ బ్రిడ్జిని ఢీకొట్టిన భారీ రవాణా నౌక
  • 1.6 మైళ్ల పొడవునా నదిలోకి పడిపోయిన బ్రిడ్జి
  • ప్రమాద సమయంలో బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలు

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్ లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి ఓ నౌక ఢీకొనడంతో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 

బాల్టిమోర్ కీ బ్రిడ్జిగా పేరుగాంచిన ఈ వంతెన పటాప్ స్కో నదిపై నిర్మించారు. ఓ భారీ రవాణా నౌక నదిలో ప్రయాణిస్తూ బ్రిడ్జి పిల్లర్లను ఢీకొట్టింది. దాంతో ఆ బ్రిడ్జిలో చాలా భాగం నదిలోకి ఒరిగిపోయింది. దాంతోపాటే పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. 

ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బాల్టిమోర్ కీ దుర్ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ఇందులో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని స్పష్టం చేశారు. పలు వాహనాలు కూడా పటాప్ స్కో నదిలో పడిపోయాయన్న సమాచారం మేరకు సహాయక కార్యక్రమాలు చేపట్టామని స్థానిక పోలీస్ చీఫ్ రిచర్డ్ వొర్లీ తెలిపారు. 

సోనార్ టెక్నాలజీ సాయంతో నది అడుగున వాహనాలు ఉన్నట్టు గుర్తించామని స్థానిక అగ్నిమాపక దళం ప్రధాన అధికారి జేమ్స్ వాలేస్ వెల్లడించారు. 

బాల్టిమోర్ కీ బ్రిడ్జి ప్రధానంగా నాలుగు లేన్ల వంతెన. నౌక ఢీకొట్టిన ఘటనలో ఇది 1.6 మైళ్ల పొడవున నదిలోకి పడిపోయింది.

  • Loading...

More Telugu News