Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్‌కు కొత్త చీఫ్‌గా పవన్ దావులూరి
- పవన్ దావులూరి ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్
- పనోస్ పనయ్ స్ధానంలో పవన్ దావులూరి నియామకం
- 23 ఏళ్లకు పైగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న పవన్
- 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా మైక్రోసాఫ్ట్‌లో చేరిక
- ప్రస్తుతం విండోస్ సిలికాన్ అండ్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు
మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త చీఫ్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి నియమితులయ్యారు. గతంలో ఈ విభాగానికి నేతృత్వం వహించిన పనోస్ పనయ్ స్ధానంలో పవన్ దావులూరిని కంపెనీ నియమించింది. పనయ్ గతేడాది అమెజాన్‌లో చేరేందుకు మైక్రోసాప్ట్ విండోస్ చీఫ్‌గా వైదొలిగారు. దాంతో ఈ పోస్ట్ అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఇప్పుడు పవన్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ పోస్టులో నియమించడం జరిగింది.
ఇక పవన్ దావులూరి 23 ఏళ్లకు పైగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో 1999లో ఎంఎస్ పూర్తిచేసిన అనంతరం పవన్.. మైక్రోసాఫ్ట్‌లో 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా చేరారు. తాజా నియామకానికి ముందు పవన్ విండోస్ సిలికాన్ అండ్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధుల్లో కొనసాగుతున్నారు.
ఇటీవలే మైక్రోసాఫ్ట్‌లో డీప్‌మైండ్ డిపార్ట్‌మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్ హెడ్‌గా నియమించింది. ఆ తర్వాత పవన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. ఇక గతంలో విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. ఇప్పుడు పవన్‌కే ఆ రెండింటి బాధ్యతలు దక్కడం గమనార్హం. కాగా, తాజా నియామకంతో అగ్రరాజ్యం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్‌కు చోటు దక్కినట్లయింది.