CSK: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ వీరవిహారం
- ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × చెన్నై సూపర్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసిన చెన్నై
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ బ్యాట్లకు పనిచెప్పింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. టాపార్డర్ లో అజింక్యా రహానే (12) తప్ప మిగతా అందరూ గుజరాత్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 46 పరుగులు చేయగా, చిచ్చరపిడుగు రచిన్ రవీంద్ర 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్ కు 5.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చింది.
ఇక శివాలెత్తినట్టు ఆడిన శివమ్ దూబే 23 బంతుల్లో చకచకా 51 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. డారిల్ మిచెల్ 24 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివర్లో రనౌట్ అయ్యాడు. ఆఖర్లో సమీర్ రిజ్వి 6 బంతుల్లో 2 సిక్సులతో 14 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయికిశోర్ 1, స్పెన్సర్ జాన్సన్ 1, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.