Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణపై సమీక్షిస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- శాంతి భద్రలను జమ్మూకశ్మీర్ పోలీసులకే అప్పగిస్తామని వెల్లడి
- ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుందన్న అమిత్ షా
- జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రస్తుతం సమర్థవంతంగా పనిచేస్తున్నారని వ్యాఖ్య
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ నుంచి కేంద్ర సాయుధ బలగాల ఉపసంహరణపై సమీక్షిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని (AFSPA ) రద్దు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. సైన్యాన్ని ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ఇక సెప్టెంబర్‌లోపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ‘జేకే మీడియా గ్రూప్’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర బలగాలను ఉపసంహరించుకొని అక్కడి శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకు వదిలివేయాలనే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. గతంలో జమ్మూ కశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని, కానీ ఇప్పుడు వారే ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. వివాదాస్పద ఏఎఫ్‌ఎస్పీఏ చట్టం గురించి ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కాగా ఏఎఫ్‌ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.
కాగా జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 70 శాతం ప్రాంతాల్లో చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని గతంలో అమిత్ షా చెప్పారు. కాగా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ జమ్మూ కశ్మీర్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.