Jagan: నేటి నుంచి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రతో ప్రచారాన్ని హోరెత్తించనున్న జగన్.. ఈరోజు షెడ్యూల్ ఇదిగో!
- ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర
- వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించనున్న జగన్
- తొలి రోజు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో కాసేపట్లో ఆయన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా జగన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. తొలుత జగన్ ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 'సిద్ధం' సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో 'మేమంతా సిద్ధం' సభలను నిర్వహించబోతున్నారు.
ఈరోజు జగన్ షెడ్యూల్ ఇదే:
- ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు.
- మధ్యాహ్నం 1.30 గంటలకు ఇడుపులపాయలో బస్సు యాత్రను ప్రారంభిస్తారు.
- ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది.
- సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో బహిరంగసభ.
- బహిరంగసభ అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంటారు.
- ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి బస చేస్తారు.