Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
- బీజాపూర్ జిల్లాలో ఈ ఉదయం ఎన్ కౌంటర్
- మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఛత్తీస్ గఢ్ లో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికుర్ బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా.. భద్రతా బలగాల రాకను పసిగట్టి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.
మిగతా మావోయిస్టుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉందని వెల్లడించాయి. మావోయిస్టుల డంప్ లో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ఇటీవల ఈ ఏరియాలోనే ముగ్గురు స్థానికులను మావోయిస్టులు చంపేశారు.