Mount Everest: ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపును అధిరోహించిన రెండున్నరేళ్ల చిన్నారి సిద్ధి.. వీడియో ఇదిగో!

Two and half year old Sidhi Mishra successfully reached Mt Everest Base Camp
  • ఎవరెస్ట్ బేస్‌క్యాంపును చేరుకున్న పిన్నవయస్కురాలిగా సిద్ధి మిశ్రా
  • తల్లిదండ్రులతో కలిసి ట్రెక్కింగ్
  • పది రోజుల్లోనే లక్ష్యసాధన
  • 2019లో ఎవరెస్ట్‌ను అధిరోహించిన సిద్ధి తల్లి భావన 
భోపాల్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సిద్ధి మిశ్రా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపునకు చేరుకుని రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న బేస్‌క్యాంపుకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా సిద్ది మిశ్రా రికార్డులకెక్కింది. ప్రైవేట్ ట్రెక్కింగ్ కంపెనీ ఈ విషయాన్ని నిర్ధారించింది. 2019లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తల్లి భావన దేహరియా, తండ్రి మహిమ్ మిశ్రాతో కలిసి సిద్ధి ఈ నెల 22న ఈ ఘనత సాధించింది.

 ఈ నెల 12న ఎవరెస్ట్‌లోని ఈశాన్యం వైపున వున్న లుక్లా నుంచి ట్రెక్కింగ్ ప్రారంభం కాగా 10 రోజుల్లోనే చిన్నారి తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఎక్స్‌పెడిషన్ హిమాలయ పేర్కొంది. చింద్వారాకు చెందిన భావన.. కుమార్తె సాధించిన విజయానికి పొంగిపోతున్నారు. ట్రెక్కింగ్ సమయంలో తాము ఎన్నో ప్రతికూల వాతావరణాలను ఎదుర్కొన్నామని వివరించారు. ఎవరెస్ట్ అధిరోహకులకు స్వాగతం పలికే హిల్లరీ, టెన్జింగ్ నార్కే హోర్డింగ్‌ల వద్ద ఈ సందర్భంగా భావన.. కుమార్తెతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది మొదట్లో స్కాట్లాండ్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఎవరెస్ట్ బేస్‌క్యాంపునకు చేరుకుంది. అయితే, ఆమెను తండ్రి తన భుజంపై మోసుకొచ్చాడు.
Mount Everest
Mt Everest Base Camp
Sidhi Mishra
Bhopal
Madhya Pradesh

More Telugu News