Container: సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వాహనం... వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి వ్యతిరేక మార్గంలో వచ్చిన కంటైనర్
- సందేహాలు వ్యక్తం చేసిన నారా లోకేశ్
- లోకేశ్ కు అంతకుమించి సంస్కారం ఎలా వస్తుందన్న వైవీ సుబ్బారెడ్డి
- అది ఫర్నిచర్ తో కూడిన కంటైనర్ అని వెల్లడి
తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వాహనం వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం గుండా కాక, వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లడం, గంట తర్వాత తిరిగి అదే మార్గంలో బయటికి వెళ్లడం పలు సందేహాలకు తావిస్తోందంటూ విపక్ష నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కంటైనర్ వాహనంలో ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ ఉందని వెల్లడించారు. అయితే, విపక్ష నేతలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ నారా లోకేశ్ బంధువులకు చెందినదని, అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిలో మంత్రి పదవిలోకి వచ్చిన లోకేశ్ కు అంతకుమించి సంస్కారం ఎలా ఉంటుంది? అని వైవీ విమర్శించారు.