Madhu Yaskhi: భువనగిరి నుంచి పోటీ చేయమని రాజగోపాల్ రెడ్డి అడిగారు: మధుయాష్కీ గౌడ్
- తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానన్న మధుయాష్కీ
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ఏ1, ఏ2 ముద్దాయిలని ఆరోపణ
- వారిద్దరికీ జైలుశిక్ష పడే రోజులు దగ్గరలో ఉన్నాయని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల్లో తనను భువనగిరి నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ తనకు ఇష్టంలేదని చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారంతా నక్సలిజం వైపు మళ్లారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ, రెడ్లు రాజ్యమేలారన్నారు. తెలంగాణ వచ్చాక రావులు రాజ్యమేలారన్నారు.
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరుగుతోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1, ఏ2 ముద్దాయిలు అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు ప్రధాన కారణం వారిద్దరేనని... వారికీ జైలు శిక్ష పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తిండిలేకుండా బతకవచ్చు కానీ స్వేచ్ఛ లేకుండా బతకలేమని... మానవ హక్కులను కాలరాస్తూ ట్యాపింగ్ చేయడం క్షమించరాని నేరం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేసేవారని విమర్శించారు.