YS Jagan: బాబాయిని చంపిన హంతకుడికి వీరంతా నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏమిటి?: సీఎం జగన్

CM Jagan said his sisters supports murderer of YS Viveka

  • ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్
  • నేడు ప్రొద్దుటూరులో తొలి సభ
  • తనను ఓడించేందుకు అందరూ కలిశారని వెల్లడి
  • తాను ప్రజలే అండగా ఎన్నికల బరిలో దిగుతున్నానని వ్యాఖ్యలు
  • బాబాయి వివేకాను చంపింది ఎవరో అందరికీ తెలుసని స్పష్టీకరణ

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్నికల  ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో తొలి సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఇంత పెద్ద మీటింగ్ ఈ జిల్లాలో ఎప్పుడూ జరిగి ఉండదేమో అనేలా జన సంద్రం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయని తెలిపారు. మన జెండా మరే జెండాతో జట్టు కట్టడంలేదని, ప్రజలే అజెండాగా మన జెండా ఇవాళ  రెపరెపలాడుతోందని అన్నారు. 

"పేదల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఈ దుష్టచతుష్టయాన్ని ఓడించాలి. ప్రజలే శ్రీకృష్ణుడిగా నేను అర్జునుడిగా ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నాను. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ రెండు సార్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసే అలవాటు లేని చెడ్డవాళ్లంతా కూటమిగా వస్తున్నారు. మీ బిడ్డ ఒంటరిగా ఎన్నికల యుద్ధంలో అడుగుపెడుతున్నాడు. 

ప్రజలను నమ్మించి మోసం చేయడంలో, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో కూడా చంద్రబాబుకు 14 ఏళ్ల అనుభవం ఉంది. 

అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేయడంలోనే కాదు... వీళ్లకు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను అందరూ చూస్తున్నారు. మా బాబాయిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. 

వివేకా చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరందరూ రోజూ చూస్తున్నారు. ఆ చంపినోడ్ని నెత్తినపెట్టుకుని మద్దతు ఇస్తున్నది చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లోమీడియా, చంద్రబాబుకు చెందిన మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తపించిపోతున్న ఒకరిద్దరు నా వాళ్లు (చెల్లెళ్లు). 

వీరంతా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏమిటి? అని అడుగుతున్నా. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే దీని అర్థమేమిటి? అని అడుగుతున్నా. నన్ను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారంటే, ఇది కలియుగం కాకపోతే ఇంకేమిటి? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? 

ప్రజల మద్దతులేని చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపు ఉన్నా నేను మాత్రం ప్రజల పక్షానే ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. నేను ప్రజలను, దేవుడ్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నాను" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News