SRH: ఉప్పల్ స్టేడియంలో పరుగుల మోత... సన్ రైజర్స్ విజేత

SRH wins run fest against MI in Hyderabad Uppal Stadium

  • భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబయిపై 31 రన్స్ తేడాతో నెగ్గిన సన్ రైజర్స్
  • తొలుత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • ఛేదనలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసిన ముంబయి
  • తన బౌలింగ్, కెప్టెన్సీతో ఆకట్టుకున్న కమిన్స్

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పరుగులు వెల్లువెత్తిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై 31 పరుగుల తేడాతో నెగ్గింది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఐపీఎల్ రికార్డు స్కోరు సాధించినప్పటికీ, ముంబయి ఇండియన్స్ కూడా దీటుగానే స్పందించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. 

ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ యాజమాన్యం వేలంలో రూ.20.50 కోట్ల ధరకు కొనుగోలు చేయడం ఎంతమాత్రం తప్పు కాదని ఈ మ్యాచ్ నిరూపించింది. ముంబయి బ్యాట్స్ మెన్ ఓవైపు భారీ సిక్సర్లతో మ్యాచ్ ను లాగేసుకుంటున్నట్టు కనిపించినా, ఎంతో కూల్ గా ఫీల్డింగ్ ప్లేస్ చేయడంతోపాటు, స్వయంగా తాను బౌలింగ్ కు దిగి రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా కమిన్స్ తన రేటుకు న్యాయం చేశాడు. 

ఈ మ్యాచ్ లో ఎంతో ప్రమాదకరంగా పరిణమించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, తెలుగుతేజం తిలక్ వర్మలను అవుట్ చేసింది కమిన్సే. మరో ఎండ్ లో లెఫ్టార్మ్ సీమర్ జయదేవ్ ఉనద్కట్ తన స్లో డెలివరీలతో ముంబయిని చికాకుపెట్టి 2 వికెట్లు తీశాడు. 

ముంబయి ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే... ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. మూడు ఓవర్లకే 50 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ జోడీ సన్ రైజర్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. రోహిత్ శర్మ 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. 

షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో ఓసారి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ... ఆ మరుసటి ఓవర్లో కమిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత నమన్ ధీర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేసి ముంబయి స్కోరు ఎక్కడా తగ్గకుండా చూశాడు. 

ఇక తిలక్ వర్మ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పవర్ హిట్టింగ్ తో అలరించాడు. వర్మ 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తిలక్ వర్మ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ ముంబయి వైపే మొగ్గు చూపింది. కానీ, సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఎంతో వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి ముంబయిని కట్టడి చేశాడు. 

కాగా, ముంబయి సారథి హార్దిక్ పాండ్యా కాసేపు క్రీజులో ఉన్నప్పటికీ అతడు చేసిందేమీ లేదు. పైగా, పాండ్యా క్రీజులోకి వచ్చాక స్కోరు వేగం తగ్గింది. మరో ఎండ్ లో టిమ్ డేవిడ్ ఆఖర్లో విరుచుకుపడడంతో ముంబయి విజయం సాధ్యమే అనిపించింది.

కానీ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో కేవలం 7 పరుగులే రాగా, ఆఖరి ఓవర్లో 47 పరుగులు చేయాల్సి వచ్చింది. మార్కండే విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ముంబయి 15 పరుగులే చేసి ఓటమిపాలైంది. టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2, ఉనద్కట్ 2, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు. 

ఈ సీజన్ తొలి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్... ముంబయి ఇండియన్స్ పై గెలవడం ద్వారా ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ కూడా మరో లెవల్లో ఉంది. ముంబయి ఆటగాళ్లు  సిక్సర్లు కొడుతున్నప్పటికీ, సన్ రైజర్స్ ఆటగాళ్లు కొన్ని చక్కని క్యాచ్ లు, ఫీల్డింగ్ విన్యాసాలతో  జట్టు విజయానికి దోహదపడ్డారు.

సన్ రైజర్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.

  • Loading...

More Telugu News