Irfan Pathan: పాండ్యా కెప్టెన్సీ సాధారణం నుంచి అధమస్థాయికి దిగజారింది: ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
- మెరుగైన బౌలర్ బుమ్రాతో సరైన సమయంలో బౌలింగ్ చేయించలేదని విమర్శలు
- జట్టు అంతా 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటే పాండ్యా కనీసం 120 స్ట్రైక్ రేటుతో ఆడలేడా అని ప్రశ్నించిన పఠాన్
- రికార్డు స్కోరు సాధిస్తుందని భావించిన ముంబైపైనే టాప్ స్కోరు నమోదవుతుందని ఎవరు ఊహిస్తారని వ్యాఖ్య
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండవ ఓటమిని చవిచూసింది. బుధవారం రాత్రి ఆ జట్టుని సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుచిత్తుగా ఓడించింది. హైదరాబాద్ బ్యాటర్లు ఏకంగా 277 పరుగులు బాదారు. భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా 31 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ దారుణ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో హార్ధిక్ పాండ్యా సారధ్యంపై విమర్శల తీవ్రత మరింత పెరిగింది.
సన్‌రైజర్స్‌పై దారుణ ఓటమి అనంతరం హార్ధిక్ పాండ్యాపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నప్పటికీ అతనితో ఆలస్యంగా బౌలింగ్ చేయించడంపై మండిపడ్డాడు. ‘‘ సాధారణంగా ఉండే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అధమస్థాయికి దిగజారింది. ప్రత్యర్థి జట్టు అంతలా విధ్వంసం సృష్టిస్తుంటే బుమ్రాతో సకాలంలో బౌలింగ్ చేయించకుండా దూరంగా ఉంచడం ఏంటో నాకైతే అర్థం కాలేదు’’ అని ఎక్స్ వేదికగా పఠాన్ విమర్శించాడు. ఇక ఐపీఎల్లో రికార్డు స్కోరు సాధిస్తుందని భావించిన ముంబై ఇండియన్స్ జట్టుపైనే రికార్డు స్కోరు నమోదవుతుందని ఎవరు ఊహిస్తారని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చితక్కొట్టిందని మెచ్చుకున్నాడు.
హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ తీరుపై కూడా ఇర్ఫాన్ పఠాన్ విరుచుకుపడ్డాడు. టీమ్ మొత్తం 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటే కెప్టెన్ కనీసం 120 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయలేడా అని తీవ్ర విమర్శలు గుప్పించాడు. కాగా భారీ లక్ష్య ఛేదనలో హార్ధిక్ పాండ్యా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా ఛేజింగ్‌లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 246/5 స్కోరు మాత్రమే చేయగలిగింది.