Maidaan: మైదాన్ మూవీ నుంచి 'టీమిండియా' సాంగ్‌ను విడుదల చేసిన ఏఆర్ రెహమాన్
- భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్‌గా మైదాన్
- అబ్దుల్ రహీం పాత్రలో హీరో అజయ్ దేవ్‌గణ్
- బోనీ కపూర్ నిర్మాతగా అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వంతో తెరకెక్కిన మూవీ
- సినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్
- ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనున్న మైదాన్
భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా 'మైదాన్' పేరుతో బాలీవుడ్లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి 'టీమిండియా' అంటూ సాగే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టీమిండియా పాటను దేశభక్తి భావాలను రేకెత్తించే క్రీడా గీతంగా అభివర్ణించారు.
అలాగే ఈ సినిమాతో పాటు పాట ఫుట్‌బాల్ ఆట గొప్పదనాన్ని, మూవీలో అజయ్ దేవ్‌గణ్ పాత్రను వివరించేదిగా ఉంటాయన్నారు. ఈ పాట కంపోజింగ్ కోసం తాను చాలా కష్టపడినట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కంపోజ్ చేసిన సాంగ్‌కు భిన్నంగా దీన్ని తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే నిర్మాత బోనీ కపూర్ ఈ మూవీని ఒక స్పోర్ట్స్ చిత్రంగా కాకుండా మానవత్వం, రొమాన్స్ ఇలా అన్ని ఉండేలా ఒక కమర్షియల్ సినిమాగా తీసుకువస్తున్నారని చెప్పారు. ఇక ఈ మూవీలో రహీం భార్య రునా పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్లు తెలిపారు. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'మైదాన్' మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, ప్రియమణితో పాటు కిర్తీ సురేష్, గజ్రాజ్ రావు, రుద్రానీల్ ఘోష్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2020లో కరోనా సమయంలో ఒకసారి మైదాన్ మూవీ కోసం వేసిన సెట్ తొలగించాల్సి వచ్చింది. అలాగే 2021లో వచ్చిన తౌక్టే తుపాను కారణంగా మరోసారి మూవీ సెట్ ధ్వంసం అయింది. ఇలా గత నాలుగేళ్లుగా ఎన్నో అడ్డంకులను దాటుకుని మైదాన్ మూవీ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక అదే రోజు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియా చోటే మియా' కూడా రిలీజ్ అవుతోంది. ఇలా ఈ రెండు బడా బాలీవుడ్ మూవీలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు దిగుతున్నాయి.