Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం
- ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచారం
- ట్రాప్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
- భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. కొండపైకి చాలా మంది భక్తులు నడక మార్గంలో వెళ్తుంటారు. అయితే కొంత కాలంగా నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గతంలో భక్తులపై చిరుతలు దాడులు చేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలేశారు.
తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.