Nallamilli Ramakrishna Reddy: అనపర్తి టికెట్ దక్కకపోవడంతో కంటతడి పెట్టుకున్న టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

Nallamilli Ramakrishna Reddy breaks into tears after Anaparti ticket goes to BJP

  • అనపర్తి అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయింపు
  • తీవ్ర నిరాశకు లోనైన టీడీపీ నేత నల్లమిల్లి
  • ఆందోళనకు దిగిన మద్దతుదారులు... టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం 
  • ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానన్న నల్లమిల్లి

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. నిన్న బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణంరాజు పేరును ప్రకటించింది.

వాస్తవానికి, పొత్తు కుదరకముందు అనపర్తి స్థానాన్ని టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది. కానీ పొత్తుతో పరిస్థితులు మారిపోగా, అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించారు. ఈ పరిణామంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓ దశలో భావోద్వేగాలు భరించలేక కంటతడి పెట్టుకున్నారు. 

పార్టీ అగ్రనాయకత్వం టికెట్ ఇవ్వకపోవడంపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానని నల్లమిల్లి అల్టిమేటం జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల్లోకి వెళతానని స్పష్టం చేశారు. అటు, తన బిడ్డకు టికెట్ దక్కలేదంటూ నల్లమల్లి రామకృష్ణారెడ్డి తల్లి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడ్ని హత్తుకుని విలపించారు. 

అటు, నల్లమిల్లికి టికెట్ దక్కకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో ఇద్దరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, మరొకరు భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఇతర కార్యకర్తలు నచ్చజెప్పడంతో వారు ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నారు. తమ నేతకు టికెట్ కేటాయించాలంటూ నల్లమిల్లి మద్దతుదారులు టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను అగ్నికి ఆహుతి చేశారు. 

నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను: నల్లమిల్లి

అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. ఐదేళ్ల పాటు తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, తన ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి కృషి చేశానని, కానీ తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News