Arvind Kejriwal: కస్టడీ ముగియడంతో కోర్టుకు కేజ్రీవాల్... న్యాయస్థానంలో ఢిల్లీ సీఎం ఏం చెప్పారంటే...!
- కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామన్న ఈడీ... తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని వెల్లడి
- కేజ్రీవాల్ తన డిజిటల్ డేటా పాస్ వర్డ్స్ ఇవ్వడం లేదన్న ఈడీ
- అరెస్ట్ చేశారు కానీ తాను నేరం చేసినట్లు ఆధారాలు చూపించలేదని కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్
- తాను ముఖ్యమంత్రిని కాబట్టి తన వద్దకు ఎంతోమంది వస్తుంటారని వెల్లడి
- మరో వారం రోజుల కస్టడీని అడిగిన ఈడీ... తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది.
ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని, తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని కోర్టుకు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. కేజ్రీవాల్ తన డిజిటల్ డేటాకు సంబంధించిన పాస్‌వర్డ్స్ ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపింది. పంజాబ్ ఎక్సైజ్ అధికారులకూ నోటీసులు ఇచ్చామని తెలిపింది. కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకు వచ్చిన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
నాపై నేరారోపణలు రుజువు కాలేదు... కోర్టుకు కేజ్రీవాల్
కేజ్రీవాల్‌కు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరడంతో అనుమతించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... ఈ కేసు గత రెండేళ్లుగా కొనసాగుతోందని, తనను అరెస్ట్ చేశారు... కానీ తనపై ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేదన్నారు. ఇప్పటి వరకు 31,000 పేజీల రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారని, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. తాను ముఖ్యమంత్రిని కాబట్టి తన వద్దకు ఎంతోమంది వస్తుంటారని తెలిపారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి తన ఫ్యామిలీ ట్రస్ట్ స్థాపన కోసం తనను కలవడానికి వచ్చారని తెలిపారు. కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఇందులోని రూ.100 కోట్లు ఏమయ్యాయి? అని ఇప్పటి వరకు తెలియరాలేదన్నారు. అయితే ఈడీ విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. దేశ ప్రజల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిమయమైందని చెప్పాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు.
కేజ్రీవాల్ స్టేట్‌మెంట్‌ను ఈడీ తప్పుబట్టింది. ఈ కేసులో రూ.100 కోట్ల కిక్ బ్యాక్‌కు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడు కాదని ఈడీ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీపై తీర్పును మధ్యాహ్నానికి రిజర్వ్ చేసింది.
కస్టడీ పొడిగింపు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆయన ఈడీ కస్టడీని 4 రోజుల పాటు పొడిగించింది. నాలుగు రోజుల పాటు ఆయనను ఈడీ విచారించి... కోర్టులో ప్రవేశపెట్టనుంది.
అసెంబ్లీలో హైడ్రామా
బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా జరిగింది. 10 రోజుల విరామం అనంతరం శాసన సభ తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. మరోవైపు, కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లారు.