Manna Krishank: కేసీఆర్‌ను ఒత్తిడికి గురి చేయాలనే కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్
- లోక్ సభ ఎన్నికలను నడిపిస్తోంది ఈసీ కాదని... ఈడీ అని మండిపాటు
- వివిధ రాష్ట్రాల్లో నాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్న క్రిశాంక్
- ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సమయాన్ని వృథా చేయాలని మోదీ చూస్తున్నారని విమర్శ
లోక్ సభ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఒత్తిడికి గురి చేయాలనే ఉద్దేశ్యంతో తమ పార్టీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికలను నడిపిస్తోంది ఈసీ కాదని... ఈడీ అని మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేయలేదనే విషయాన్ని బయటకు రానివ్వకుండా... ఎవర్నీ అడగనివ్వకుండా ప్రధాని మోదీ చేశారన్నారు. ఇవాళ మీడియాలో మొత్తం ఈడీ, సీబీఐ అరెస్ట్‌లపై చర్చ సాగుతోందన్నారు. కశ్మీర్ నుంచి కేరళ వరకు ఈడీ, సీబీఐ కేసులతో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెడుతోందన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌నూ అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, కేరళ... అంతా ఇదే చర్చ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేకపోతోందన్నారు. నిన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురుకు ఈడీ నోటీసులు ఇచ్చిందని, ఆర్జేడీ నాయకుడి మీద ఈడీ దర్యాప్తు చేస్తున్నారని, మహారాష్ట్రలో శివసేన అభ్యర్థి నామినేషన్ వేసిన కొద్ది సేపట్లోనే ఈడీ నోటీసులు వచ్చాయని, తమిళనాడులో డీఎంకే నాయకుడు రాజా మీద పాత కేసులో సీబీఐ ఛాలెంజ్ చేస్తోందని, టీఎంసీ నేత మహువా మోయిత్రాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని... ఇలా ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం విచారణ సంస్థలను ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సమయాన్ని వృథా చేయాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. కశ్మీర్ నుంచి మొదలు కేరళ వరకు ఈడీ నోటీసులే అన్నారు. డజన్‌కు పైగా రాష్ట్రాల్లో ఈడీ కేసులు, దర్యాప్తులు కొనసాగుతున్నట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికలు నడుస్తుంటే.. ఈడీ, సీబీఐలపై చర్చ తప్ప.. మోదీ పాలనపై చర్చ లేదన్నారు.
మద్యం కేసులో రూ.10వేల కోట్ల అవినీతి జరిగిందని బండి సంజయ్ అంటుంటే... ఈడీ ఏమో రూ.100 కోట్ల స్కాం అంటోందని విమర్శించారు. సుజనా చౌదరి రూ.6,000 కోట్ల బ్యాంక్ కేసు ఏమైందో చెప్పాలని నిలదీశారు. బీజేపీకి లొంగితే అరెస్ట్‌లు, దాడులు ఉండవని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోకుండా ఈడీ కార్యాలయం చుట్టూ తిరగాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రజలుకు అన్నీ వివరిస్తామన్నారు. బీజేపీ ఓడిపోనుందని... అందుకే ఆయా రాష్ట్రాల నాయకులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.