Chandrababu: ఈ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా... ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తాం: చంద్రబాబు
- కొనసాగుతున్న ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర
- అనంతపురం జిల్లాలో చంద్రబాబు సభ
- హామీలను మరోసారి ప్రజలకు వివరించిన చంద్రబాబు
- ఉత్తుత్తి బటన్ కాదు... నిజమైన బటన్ నొక్కుతానని ఉద్ఘాటన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రంలో ఆయన ప్రసంగిస్తూ... సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు.
అభివృద్ధి చేస్తే సంపద వస్తుందని, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుందని అన్నారు. అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇలా వడ్డీ కడుతూ అప్పులు చేస్తూ పోతే సుడిగుండంలో చిక్కుకుని మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయని చంద్రబాబు వివరించారు.
"మీ అందరికీ ఒకటే చెబుతున్నా. నేను సంపద సృష్టిస్తా. ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతా. నిజమైన బటన్ నొక్కుతా. ఉత్తుత్తి బటన్ కాదు. అందుకే ఈ రోజు చెబుతున్నా... ఆడబిడ్డలూ మీరు గుర్తుపెట్టుకోండి... డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే... జ్ఞాపకం ఉందా తల్లీ మీకు? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, వంట గ్యాస్ ఇచ్చింది నేనే, మరుగుదొడ్లు కట్టించింది నేనే, ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్... జ్ఞాపకం ఉందా మీకు?
ఈ రోజు మళ్లీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తాం. ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే రూ.3 వేలు, ముగ్గురుంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6 వేలు. ఇందులో ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. మీ ఖాతాలోకి నేరుగా పంపిస్తా. నేనే ఫోన్ చేసి చెబుతాను మీకు.
ఇక రెండో పథకం తల్లికి వందనం. బిడ్డలు తల్లిదండ్రులకు రుణపడి ఉంటారు. తండ్రి కంటే తల్లికి ఎక్కువ రుణపడి ఉంటారు. నవమాసాలు మోసి కని పెంచేది తల్లి. తాను కడుపు మాడ్చుకుని అయినా బిడ్డ కోసం పాటుపడేది తల్లి. అందుకే తల్లికి వందనం పథకం కింద ఒక బిడ్డ ఉంటే రూ.15,000. ఇద్దరు బిడ్డలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు. ఇచ్చే బాధ్యత మాది.
ఈ రోజు నేను ఆలోచించేది ఒకటే... ప్రజలే ఆస్తి. ప్రజలను సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచంలో ఎక్కువగా సంపాదించే జాతి ఏదంటే... భారతీయులు. అందులో 30 శాతం మంది తెలుగువారే. అదే నాకు గర్వకారణం. అదే నేను వేసిన పునాది. దీపం పథకం తీసుకువచ్చింది నేనే. కానీ దుర్మార్గులు దీపం ఆర్పేశారు. మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపం వెలిగిస్తా.
ఆర్టీసీ ఎర్ర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రైతును రాజును చేయడం నా ధ్యేయం. రైతులకు నీళ్లు ఇస్తే కాసుల వర్షం కురిపిస్తారు. గతంలో నేనిచ్చిన నీళ్లు, డ్రిప్ ఇరిగేషన్ ను ఉపయోగించుకున్న రైతులు మాకు మూడు కోట్లు, నాలుగు కోట్లు వచ్చాయని చెబుతుంటే నాకు కళ్లు తిరిగాయి. మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకువస్తాం. ప్రతి ఒక్క రైతుకు రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తాం.
యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తాం. యువత ఆశలను ప్రోత్సహిస్తాం. ఏడాదికి 4 లక్షల చొప్పున యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు నేనిస్తాను. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి... తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. డీఎస్సీ నిర్వహిస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు రూ.3 వేల భృతి కూడా ఇస్తాం.
ఇంటింటికీ సురక్షిత తాగు నీరు కల్పిస్తాం. బీసీ రక్షణ చట్టం తీసుకువస్తాం. పెన్షన్ దారులకు ఒకటే చెబుతున్నా... ఆ పెన్షన్లు తీసుకువచ్చింది ఎన్టీఆర్. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారు రూ.30 పెన్షన్ ఇచ్చారు. సమైక్యాంధ్ర సమయంలో నేనే రూ.75 చేశాను. 2014లో నేను ముఖ్యమంత్రిని అయ్యాక రూ.200గా ఉన్న పెన్షన్ ను రూ.2 వేలు చేశాను. అబద్ధాలకోరు చెబుతున్నాడు... ఆయనేదో పెంచాడంట. నోరు విప్పితే అది అబద్ధాల పుట్ట. మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం పెంచుతాం" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.